భారత్ముందే హెచ్చరించినా.. ఐరోపా దేశాలు పట్టించుకోలే!  :బెల్జియం ప్రధాని బాట్ డి వెవర్

భారత్ముందే హెచ్చరించినా.. ఐరోపా దేశాలు పట్టించుకోలే!  :బెల్జియం ప్రధాని బాట్ డి వెవర్
  • విదేశీ వస్తువుల దిగుమతిపై బెల్జియం ప్రధాని బాట్ డి వెవర్

న్యూఢిల్లీ: చౌకగా దొరికే విదేశీ వస్తువుల దిగుమతికి అనుమతించడంపై భారతదేశం చేసిన హెచ్చరికలను ఐరోపా దేశాలు అప్పట్లో విస్మరించాయని బెల్జియం ప్రధాని బాట్ డి వెవర్ అంగీకరించారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్​ఆఫ్​ఇండియన్​ఇండస్ట్రీ (సీఐఐ) కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆర్థికంగా ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల కలిగే ముప్పును భారత్ చాలా ముందే గుర్తించి ఐరోపా దేశాలను హెచ్చరించిందని.. కానీ, అప్పట్లో తాము పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పరిణామాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. విదేశీ అదనపు ఉత్పత్తిని తమ మార్కెట్లలోకి చౌకగా డంప్ చేయనివ్వడం వల్ల ఐరోపా పారిశ్రామిక బేస్ బలహీనపడిందని, ఈ విషయంలో ఐరోపా ఆలస్యంగా కళ్లు తెరిచిందని అన్నారు.

చైనాను ఉద్దేశించి బాట్ డి వెవర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పరస్పర గౌరవాన్ని కోరుకునే ఐరోపాకు భారతదేశం నంబర్ వన్ భాగస్వామి అని ఆయన తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత రంగాలలో సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.